బాలీవుడ్ లో ఇంకా ఖాన్స్ పని ఖతమేనా??

kgf

బాలీవుడ్ లో గత రెండు, మూడు దశాబ్దాల్ని తిరగేస్తే మనకు ఖాన్స్ ముగ్గురు మాత్రమే ప్రధానంగా కనిపిస్తారు. ఇతర హీరోలు, స్టార్స్ ఉన్నా కూడా షారుఖ్, సల్మాన్, ఆమీర్ త్రయానిదే బాక్సాఫీస్ సామ్రాజ్యం. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు వారు. అయితే, ‘ఖాన్స్‌ ఆప్ ముంబై’కి ఇప్పుడు డూ ఆర్ డై సిట్యుయేషన్ ఏర్పడిందా?అవునంటున్నారు కొందరు బీ-టౌన్ విశ్లేషకులు.

బాలీవుడ్ బాద్షా, ‘దబంగ్’ ఖాన్, మిష్టర్ పర్ఫెక్షనిస్ట్… ఇలా తమకంటూ ప్రత్యేకమైన బిరుదులు సంపాదించుకున్నారు ఖాన్స్. కానీ, ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందించిన షారుఖ్, సల్మాన్, ఆమీర్… ప్రస్తుతం ఓ బలమైన బాక్సాఫీస్ విజయం కోసం తహతహలాడుతున్నారు. కారణం… వారి గత చిత్రాలు అభిమానుల్ని మెప్పించలేక బొక్క బోర్లా పడటమే. కింగ్ ఖాన్ నటించిన లాస్ట్ మూవీ ‘జీరో’ పేరుకి తగ్గట్టుగానే జీరో రిజల్ట్ సాధించింది. ఆమీర్ చివరి చిత్రం ‘థగ్స్ ఆప్ హిందూస్థాన్’ కూడా బాక్సాఫీస్ వద్ద మునకేసింది. సల్మాన్ గత చిత్రం ‘రాధే’ అయితే థియేటర్‌కి రాకుండా నేరుగా ఓటీటీకి వెళ్లింది. అక్కడ వసూళ్ల గోల లేకున్నా రివ్యూస్ మాత్రం పరమ దారుణంగా సంపాదించుకుంది. మొత్తానికి ముగ్గురు ఖాన్స్ మూడు ఫ్లాపులతో గత మూడేళ్ల కాలాన్ని నెట్టుకొస్తున్నారు!

షారుఖ్, సల్మాన్, ఆమీర్‌కు హిట్ మూవీసే కాదు… ఫ్లాపులు కూడా కొత్త కాదు. తమ సుదీర్ఘ కెరీర్స్‌లో ఇంతకు ముందు చాలా సార్లు అపజయాలు చవి చూశారు. కానీ, ఇప్పుడు ఫ్లాపులతో పాటూ గ్యాప్ కూడా భారీగా వచ్చేసింది. సల్మాన్ గత ఏడాది జనం ముందుకొచ్చాడు. ఎస్ఆర్కే, ఆమీర్ మాత్రం 2018 నుంచీ బాక్సాఫీస్‌కు దూరంగానే ఉంటున్నారు. చాలా రోజులుగా తమ స్టార్స్ ముఖం చాటేయటంతో ఖాన్స్ అభిమానులు ఒకింత అసహనంగానే ఎదురు చూస్తున్నారు. వారి నీరీక్షణ ఫలించాలంటే మరిన్ని నెలలు పట్టనుంది.

ఆగస్ట్‌లో ‘లాల్ సింగ్ చద్దా’గా ఆమీర్ వస్తున్నాడు. డిసెంబర్‌లో ‘కభీ ఈద్ కభీ దివాలీ’తో సల్మాన్ బరిలో దిగుతున్నాడు. 2023 జనవరిలో ‘పఠాన్’గా రానున్నాడు బాలీవుడ్ బాద్షా. ఇంతలా గ్యాప్ తీసుకుని వస్తుండటం కూడా ముగ్గురు ఖాన్స్ నెక్ట్స్ మూవీస్‌పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తోంది.

షారుఖ్, సల్మాన్, ఆమీర్ సినిమాల ఆలస్యానికి కరోనా ప్రధాన కారణమనే చెప్పుకోవాలి. కానీ, అదే కరోనా లాక్‌డౌన్స్ అడ్డుపడుతోన్నప్పటికీ చాలా మంది హిందీ హీరోలు, దక్షిణాది స్టార్స్ తమ సినిమాలతో కొన్ని నెలలుగా దూసుకొచ్చేస్తున్నారు. పైగా హిందీ ప్రేక్షకులు అంతకంతకూ సౌత్ హీరోల ప్యాన్ ఇండియన్ సినిమాలకు అలవాటు పడిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప’ లాంటి సినిమాలు స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీస్ కంటే బెటర్ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నేపథ్యంలో… ఖాన్స్ పేరున విడుదల కాబోయే నెక్ట్స్ మూవీస్ కేవలం హిట్ అయితే సరిపోదంటున్నారు క్రిటిక్స్.

‘ఆర్ఆర్ఆర్, కేజీఎప్ చాప్టర్ 2’ సినిమాల కంటే భారీగా ‘లాల్ సింగ్ చద్దా, కభీ ఈద్ కభీ దివాలీ, పఠాన్’ సినిమాలు సంపాదించాలంటున్నారు! మరి షారుఖ్, ఆమీర్, సల్మాన్ సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ మార్కెట్లలో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడతాయా? అనుమానమేనంటున్నారు బిజినెస్ ఎనలిస్టులు. కేవలం హిందీ బెల్టు, ఓవర్ సీస్ మార్కెట్లలోనే ఖాన్స్ ప్రభావం ఉంటుంది. అక్కడే ఆదాయం పెంచుకుని ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్’ లాంటి ప్యాన్ ఇండియన్ మూవీస్‌తో పోటిపడి గెలవాలి! కష్టమైనా… ఆ బాక్సాఫీస్ ఫీట్ సాధిస్తేనే ఇకపైన కూడా ఖాన్ల త్రయం ఆధిపత్యం కొనసాగేది. లేదంటే… లెట్స్ వెయిట్ అండ్ సీ!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*