కమ్మనైన భారతమ్మ రుచులు, ఒక్కసారి తింటే వదలరు – భారతమ్మ రుచులు సక్సెస్ స్టోరీ 

bharatamma ruchulu

ఆ ఊరికి కొత్తగా కలెక్టర్ వచ్చారు. నార్త్ ఇండియన్ రొట్టెలు, పరాఠాలు తిని తినీ విసుగొచ్చేసిన తన జిహ్వకు ఉన్న తుప్పు వదిలిపోయేలా ఏదైనా రుచికరమైన తెలుగు వంటకం తినాలని ఆయనకు మనసు లాగేస్తోంది. ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన తర్వాత నాలుగు రోజుల నుంచి ఏదీ తినాలని అనిపించడం లేదనే విషయం అధికారులదాకా వెళ్లింది. అయ్యగారిని ప్రసన్నం చేసుకోవడానికి ఓ ఉపాయం ఆలోచించారు సిబ్బంది. నేరుగా ఓ పెద్దావిడ దగ్గరికి వెళ్లి, విషయం చెప్పారు. చెయ్యి తిరిగిన ఆమె.. రెండు గంటల్లో నాలుగైదు రకాల వెజిటేరియన్ స్పెషల్స్ చేసి పంపింది. ఇది తిన్న కలెక్టర్‌ నోటమాట రాలేదు. మళ్లీ మళ్లీ అదే రుచి కావాలంటూ, తన సొంత ఇంటి ఫుడ్ కూడా మర్చిపోయారు. ఇద్దరు ముగ్గురు ఐపీఎస్‌లకూ, జిల్లా జాయింట్ కలెక్టర్లకు కూడా దాదాపుగా ఇదే అనుభవం ఎదురైంది.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఉదంతం కడప జిల్లాల్లో ముప్ఫై, నలభై ఏళ్ల కిందట జరిగిన యధార్థం.

అప్పటి మద్రాసుకు వెళ్లలేని రోగులను చూసేందుకు అక్కడి నుంచి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు నెలకు ఒకటి, రెండుసార్లు కడప వచ్చే వాళ్లు. పూర్తి నాన్ వెజ్ ప్రియులైన సదరు డాక్టర్లు ఆ పెద్దామె చేతి శాఖాహారం రుచి వదల్లేక వారం వారం పేషెంట్లను చూసే నెపంతో కడపలో వాలిపోయేవారంటే అతిశయోక్తి కాదంటారు ఈ విషయం బాగా తెలిసిన వాళ్లు. పచ్చళ్లు, పొళ్లు, బిసిబెళాబాత్, పెరుగన్నంతోనే ఆ పెద్దామె అపరిమిత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

ఇంతసేపూ మనం మాట్లాడుకున్న ఆ పెద్దామె పేరు భారతమ్మ. వయస్సు ఇప్పుడు 84 ఏళ్లు. అవును ఎనిమిది పదులు దాటేసిన ఆమె ఇప్పటికీ అంతే ఉత్సాహంతో జనాల నోళ్లను కమ్మనైన రుచులతో నింపేస్తున్నారు.  

కడప టౌన్‌ యెర్రముక పల్లె ప్రాంతానికి చెందిన శ్రీమతి విజయ భారతికి చిన్నప్పటి నుంచే వంటలంటే ఎనలేని అభిమానం. కుటుంబ రీత్యా ఉన్నతంగా స్థిరపడినప్పటికీ.. ఆ వంటలే వల్లే ఆమె చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకు మరింత ప్రియమయ్యారు. దగ్గరి కుటుంబాల్లో వాళ్లకు ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా లేదా ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా హాల్టింగ్ మాత్రమే తమ ఇల్లే ఉండేదంటారు భారతమ్మ. వేడివేడిగా చేసే బిసిబాళెబాత్ అయినా, నోటి తుప్పంతా వదలగొట్టగలిగే రసమైనా ఆమె చేస్తేనే తినాలనేంత పేరు చుట్టుపక్కల సర్కిల్స్‌లో ఉండేది. నగరానికి వచ్చే ప్రముఖులు రాయలసీమ వెజిటేరియన్ స్పెషల్స్, పచ్చళ్లు వంటివి రుచి చూడాలంటే.. మొదటి ఫోన్ భారతమ్మకే వచ్చేది.  

bharatamma ruchulu

హైదరాబాద్‌కి భారతమ్మ రుచులు

వ్యక్తిగత అవసరాలు, కుటుంబ బాధ్యతల నేపధ్యంలో కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన తర్వాత చాలాకాలం పాటు ఆమె పాకశాస్త్ర ప్రావీణ్యం మరుగునపడిపోయింది. చేతికి అందొచ్చిన కొడుకుల కారణమే కాకుండా, ఇక్కడ ఎవరూ పెద్దగా పరిచయం లేకపోవడంతో ఆమెకు చేయి తీసేసినట్టు అయింది. చేసేది లేక చాలాకాలం పాటు చుట్టుపక్కల బంధువులకే పరిమితమైన ఆ రుచులు మళ్లీ కొన్నేళ్ల నుంచి పూర్తిస్థాయిలో విస్తరించాయి. వందలాది మంది నోటికి మళ్లీ ఆ రుచుల పరంపర కొనసాగుతోంది. విదేశాల్లో ఉంటున్న వాళ్లు కూడా ఆ జిహ్వాచాపల్యాన్ని చంపుకోలేక వేలకు వేలు ఖర్చు చేసి మరీ ఫ్లైట్లలో తెప్పించుకుంటున్నారు. 

ఇంతకీ ఏంటి ఈ భారతమ్మ రుచులు

వయస్సు మీదపడ్తున్నా.. ఆమెలో ఏ మాత్రం ఉత్సాహం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులకు ఓ ఆలోచన వచ్చింది. ఆమె చేతి రుచులు మనకు, మన వాళ్లకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఒకరిద్దరి సాయంతో భారతమ్మ రుచుల పేరుతో ఓ చిన్న కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయించారు. పాతకాలం పద్ధతుల్లో నూటికి నూరు శాతం శుచి, శుభ్రతతో పదార్థాలు చేయడమే తమ సక్సెస్ సీక్రెట్ అంటారు భారతమ్మ. టైం లేదు టైం లేదు అనే స్పీడ్‌లో పడిపోయి ఏం తింటున్నామో తెలియని ఈ రోజుల్లో నాణ్యమైన ఆహారాన్ని అందరికీ అందించే ఏకైక ఉద్దేశంతోనే ఈ బ్రాండ్ ఏర్పాటు చేయడానికి కారణమని చెబ్తారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం లేక, పొద్దున పూట వండుకునే తీరిక లేక ఏదో ఒక చెత్త తినేస్తాం. అయితే కేవలం ఐదు నిమిషాల తీరిక చేసుకోగలిగితే మా దగ్గర దొరికే పులిహోర పేస్ట్, బిసిబేళబాత్ పౌడర్, వాంగీబాత్ పౌడర్‌తో కమ్మటి ఇన్‌స్టెంట్ ఫుడ్ తయారుచేసుకోవచ్చు” అని చెబ్తారు భారతమ్మ. వీటితో పాటు ఇడ్లీ, దోశల్లోకి ఉపయోగించే పల్లీ పొడి, ఇడ్లీకారం, పొడి చెట్నీ వంటివి వీళ్ల దగ్గర సూపర్ హిట్ బ్రాండ్స్. దాదాపుగా ఎక్కడా దొరకని చింతాకు నువ్వుల పొడి, అవిశల నువ్వుల పొడికి కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారని చెప్తారు. ఒకసారి ఆర్డర్ చేసిన వారు మళ్లీ మళ్లీ రిపీటెడ్‌గా రావడానికి కారణం క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకపోవడమే అని వివరిస్తారు. గానుగ ద్వారా పట్టిన నువ్వుల నూనె, పల్లీ నూనె, ఆవ నూనె మాత్రమే వినియోగిస్తామని, అందుకే టేస్ట్‌లో ఎలాంటి మార్పూ ఉండదని చెప్తారు భారతమ్మ రుచుల బ్రాండ్ మేనేజర్ అనురాధా. రసం పౌడర్, సాంబార్ పౌడర్, వివిధ రకాల పచ్చళ్లు.. ఎప్పటికప్పుడు చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటాయని ఆమె చెప్తారు. 

ఎన్ఆర్ఐల డిమాండ్

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రస్తుతం డెలివర్ చేస్తున్న ఈ సంస్థ, త్వరలో వివిధ ప్రాంతాలకూ, జిల్లాలకు ఫ్రాంచైజీలు ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతానికి రోజుకు అవసరాన్ని బట్టి 40-50 కిలోల ఉత్పత్తులను తయారు చేస్తూ, సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా అమెరికా నుంచి పచ్చళ్లు, పొళ్లు, రెడీ మిక్స్ పౌడర్లకు మంచి గిరాకీ ఉంటోందని, ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్లు ఫోన్ చేసి మరీ అభిమానంగా మాట్లాడడంతో ఫ్యామిలీ లాంటి బాండింగ్ ఏర్పడ్తోంది అని కళ్లుచెమరుస్తారు భారతమ్మ. ప్రస్తుతం హైదరాబాద్‌ మోతినగర్‌లో చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఔట్‌లెట్ ఏర్పాటు చేసి నలుగురికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు.  ఆర్డర్ల కోసం 70366 00060లో సంప్రదించవచ్చని భారతమ్మ రుచుల బృందం చెబ్తోంది.

bharatamma ruchulu

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*