భళా తందనాన రివ్యూ..

bhala tandanana review

నీది నాది ఒకే కథ సినిమా తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీ విష్ణు హీరోగా బాణం, బసంతి లాంటి సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం భళా తందనాన. టైటిల్ వినగానే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. చాలా కాలం తర్వాత క్యాథరిన్ తెరిసా హీరోయిన్ గా నటించడమే కాక సినిమాను ప్రతిష్ఠాత్మక వారాహి చలన చిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది అనేది చూస్తే…శశిరేఖ (క్యాథరిన్ తెరిసా) ఒక ప్రముఖ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటుంది.

ఒక అనాధ శరణాలయం మీద రైడ్ చేస్తున్న సమయంలో ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన ఆమెకు చంద్రశేఖర్(శ్రీ విష్ణు) పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనుకుంటున్న తరుణంలో తాను ఆనంద్ బాలి (గరుడ రామ్) అనే ఒక హవాలా మాఫియా డాన్ కేసు స్టడీ చేస్తున్నా అనే విషయం వెల్లడిస్తుంది. అదే సమయంలో సిటీలో వరుస మర్డర్లు కలకలం రేపుతాయి. ఆనంద్ బాలి హ్యాండోవర్ లో ఉన్న రెండు వేల కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకున్న శశిరేఖ దానిని తమ మీడియా సంస్థలో ప్రచురిస్తుంది. దీంతో అనూహ్య పరిస్థితులలో చందు మిస్ అవుతాడు. ఆ రెండు వేల కోట్ల రూపాయలకు చందుకి ఉన్న సంబంధం ఏమిటి? రెండు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి? చివరికి చందు శశిరేఖ ఒక్కటయ్యారా అనేది సినిమా కథ.సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచి చెబుతూ వచ్చారు కానీ సినిమాలో తరువాత జరగబోయే విషయం ఏమిటి అనే అంశం సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది.

తొలుత చంద్ర శేఖర్ ఒక అమాయకమైన వ్యక్తిగా పరిచయం కావడం, అతనిని చేతగాని వాడిగా చూపించడంలో సఫలమయ్యారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ కు ముందు చంద్ర శేఖర్ కు మరో రూపం ఉందని అందరూ అనుకుంటున్నట్టు అమాయకుడు కాదని ట్విస్ట్ ఇస్తారు. అయితే ఈ విషయం ముందుగానే అర్థమైపోతుంది. కానీ చంద్ర శేఖర్ అమాయకుడు కాదని తెలిసిన తరువాత కథ కాస్త వేగం పుంజుకుంటుంది. చివరికి రెండు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వకుండానే సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

మొదటి భాగం ఎలా ఉందంటే? ఈ సినిమా మొదటి భాగం అంతా కూడా పాత్రల పరిచయానికి కేటాయించారు అని చెప్పవచ్చు. తొలుత ఒక కిడ్నాప్ జరగటం ఆ తర్వాత దానిని కనెక్ట్ చేస్తూ కథ చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కిడ్నాప్ చేసిన ప్రతి ఒక్కరూ చనిపోతూ రావడం, ఆ తరువాత హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం వంటి సన్నివేశాలను మొదటి భాగంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. హీరో అమాయకుడు కాదనే విషయాన్ని ప్రీ ఇంటర్వెల్ లో చూపించి రెండో భాగం మీద ఆసక్తి పెంచాడు దర్శకుడు.రెండోభాగం మొదలైనప్పటికే హీరో అమాయకుడు కాదనే విషయం తెలియడంతో తరువాత ఏం జరగబోతోంది అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది. రెండో భాగంలో రెండు వేల కోట్ల రూపాయల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అసలు హీరో ఎవరు? ఏమిటి? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు కానీ, రోజు అతనితో తిరిగే వాళ్ళకి కూడా తెలియని విషయాలను తెరమీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద రెండు వేల కోట్ల రూపాయల హవాలా డబ్బు వ్యవహారం ఏమైంది అనే విషయం సస్పెన్స్ లోనే ఉంచేశారు.

బాణం, బసంతి లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య దంతులూరి చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం భళా తందనాన. చైతన్య దంతులూరి నుంచి సినిమా వస్తుందంటే కాస్త సినీ అవగాహన ఉన్న ఎవరైనా మంచి అంచనాలతో థియేటర్ కు వస్తారు. చైతన్య దంతులూరి ఎంచుకున్న కథ బాగానే ఉంది కానీ కథనంలో చిన్న చిన్న పొరపాట్లు కథా గమనాన్ని కాస్త ఇబ్బంది పెట్టాయి. అయితే టేకింగ్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు పక్కన పెడితే చైతన్య పనితనం స్క్రీన్ మీద కనిపించింది.. కథ బలమైనది అయినా కథనం ఆకట్టుకునే విధంగా ఉంటే మరింత సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ ల నటన విషయానికి వస్తే శ్రీ విష్ణు నటనలో పరిణితి కనిపించింది. గతంలో ఆయన సినిమాల కంటే ఈ సినిమాలో నటనలో ఆయన ఇంప్రూవ్ అయ్యారు. చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించిన క్యాథరిన్ తెరిసా కాస్త ఒళ్లు చేసినట్లు కనిపించింది. అలాగే డబ్బింగ్ ఆమెకు స్వయంగా చెప్పడంతో కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. మాకు తెలుగు పదాలు స్పష్టంగా పలకడం రాకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది అని చెప్పాలి.ఇక విలన్ గా నటించిన గరుడ రామ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించి మెప్పించారు. కొంత గ్యాప్ తీసుకుని తెర మీద కనిపించిన పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు ఇక సినిమా మొత్తం మీద కామెడీని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు సత్య.. కనిపించింది ఒకటి రెండు సీన్లే అయినా శ్రీనివాసరెడ్డి డి శ్రీకాంత్ అయ్యంగార్ కూడా తమదైన నటనతో మెప్పించారు. ఇక మిగతా పాత్రలు పాత్రధారులు తమ తమ పరిధిమేర నటించారు.సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన చైతన్య దంతులూరి తన పాత్రను సమర్థవంతంగా పూర్తి చేశారు. అలాగే ఈ సినిమాకు కథ అందించిన శ్రీకాంత్ విస్సా పనితనం కూడా కనిపించింది. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అలాగే ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.

సినిమాటోగ్రాఫర్ సురేష్ కష్టం కొన్ని కొన్ని సీన్లలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ఎడిటింగ్ టేబుల్ మీద ఫస్టాఫ్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు వారాహి చలనచిత్రం స్థాయికి తగినట్లు ఉన్నాయి.వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పవచ్చు. తనవైన కామెడీ టైమింగ్ తో యాక్షన్ తో ప్రేక్షకులను అలరించాడు. కొన్ని కొన్ని చిన్న చిన్న లాజిక్స్ పక్కనపెట్టి చూస్తే ఆద్యంతం ఫ్యామిలీతో కలిసి ఆనందించదగ్గ సినిమా. ఎలాంటి అసభ్యతకు అశ్లీలతకు తావులేకుండా ఒక క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా సాగింది. కొన్ని సీన్స్ లో ఖచ్ఛితంగా ప్రేక్షకులకు థ్రిల్లర్ ఫీల్ కలుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*